* నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం (ఆగస్టు 19) ఆమోదముద్ర వేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్ఆర్ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయంతో అన్ని సంస్థలకు కలిపి ఒకటే పరీక్ష కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీఈటీ) నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మూడేళ్ల పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి 20 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఉద్యోగ నియామకానికి సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ఆన్లైన్లో సీఈటీ..
సీఈటీని ఆన్లైన్లో నిర్వహిస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఐబీపీఎస్ కోసం సీఈటీ తొలి దశ పరీక్షలు నిర్వహిస్తుంది. సీఈటీని డిగ్రీ, పన్నెండు, పది తరగతులు ఉత్తీర్ణులైన వారు దేశంలో ఎక్కడి నుంచైనా రాయవచ్చు. దేశవ్యాప్తంగా 117 జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment